మాన్సాస్‌లో పెనుమార్పు..!

విజయనగరం: విజయనగరం జిల్లా చరిత్రలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తనకు ఇంతటి బృహత్తర బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సంచయిత గజపతిరాజు కృతజ్ఞతలు తెలిపారు. మాన్సాస్‌ ట్రస్ట్‌కు సంబంధించి జరిగిన ఈ పరిణామం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నో ఏళ్లుగా నిరంకుశంగా మాన్సాస్‌పై పెత్తనం చెలాయిస్తున్నవారికి గట్టి దెబ్బ తగిలిందని జనం చర్చించుకోవడం మొదలైంది.